కోరుకున్న కెరీర్ ని మలుచుకోవడం ఎలా?

ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదోఒకటి సాధించాలని అనుకుంటూ వుంటారు. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనుకుంటారు. ఇతరులమీద ఆధారపడకుండా తమ సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలని అనుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను నిర్వహించుకుని.. ఒక మంచి కెరీర్ ని నిర్మించుకోవడానికి జీవితంలో అన్ని కష్టాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడుతారు. ముందుగానే అన్ని విషయాల గురించి ఆలోచించుకుని, సమయానుకూలంగా ముందడుగు వేస్తూ.. విజయాలవైపు ముందుకు సాగిపోతారు.

అయితే మరికొంతమంది మాత్రం దొరికిన అవకాశతోనే సర్దుకుపోతూ.. కెరీర్ గురించి ఆలోచించకుండా సామాన్య జీవితాన్ని గడుపుతారు. ఇంకొంతమంది అయితే కెరీర్ ను ఎలా మలుచుకోవాలో సరిగ్గా అర్థం కాక.. తికమకతో ఇటుఅటూ నిర్ణయాలు తీసుకుంటూ సతమతమవుతుంటారు. ఏ సమయంలో ఎటువంటి అడుగు వేయాలి..? ఎటువంటి ప్రణాళికలు మన జీవితానికి తోడ్పడుతాయి..? అన్న విషయాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.

అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన నిర్ణయం కాదు. ఇతరుల చెప్పిన విధంగా నడుచుకోకుండా మీకు మీరుగానే వుండాలి. మీరు నిర్దేశించుకున్న బాటలోనే ముందుకు నడవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే.. మీ గురించి మీకంటే బాగా ఇంకెవ్వరికీ తెలియదు. మీలో వున్న ఇష్టాలు, కోర్కెల గురించి ఈ జగత్తులోనే మరెవ్వరికీ తెలియదు. వాటికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణకు, కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే.. మీరు కోరుకున్న జీవితాన్ని, కెరీర్ ను మలుచుకోగలుగుతారు. వాటికి సంబంధించిన కొన్ని ముందు ప్రణాళికలు, పనులు కూడా నిపుణులు మనకు సూచిస్తున్నారు. అవేమిటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం.

కావాల్సింది ఏదో తెలుసుకోవడం…

మానవుని కోరికలు అనంతం అంటుంటారు చాలామంది. వాటిని తీర్చుకోవడానికి మొత్తం జీవితాంతం సరిపోదు కాదుకదా… ఆలోచించడానికే సమయం సరిపోతుంది. అయితే అందులో కొన్ని ప్రత్యేకమైన కోరికలు కూడా వుంటాయి. అటువంటి వాటికే ప్రత్యేక ప్రాధాన్యతను కూడా ఇస్తారు. అలాగే మీకు ఏం చేస్తే నచ్చుతుందో.. ఎలాంటి ఉద్యోగం చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో.. ఏ పని అయితే ఎక్కువ శ్రమ అనిపించదో.. ముందుగా అటువంటి విషయాల గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి!

మీకు నచ్చిందో ఏదో కూడా మీరు తెలుసుకోలేకపోతే.. ముందుగా మీకు ఎక్కువగా నచ్చే విషయాల గురించి ఒక పట్టికను రాసిపెట్టుకోండి. వాటిగురించే నిత్యం ఆలోచించడం మొదలుపెట్టండి.అందులో మరీ ముఖ్యమైనవి ఏదో ఏకాగ్రతతో గమనించండి. అప్పుడే మీరు మీలో వున్న నైపుణ్యత, సామర్థ్యతను తెలుసుకోగలరు. దానిద్వారా మీకు నచ్చే ఉద్యోగంగానీ, పనిగానీ, భవిష్యత్ ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం గానీ జరుగుతుంది.

అయితే ఇటువంటి వాటి గురించే ఎక్కువసేపు ఆలోచిస్తూ సమయాన్నే వృధా చేసుకోకుండా.. దొరికిన ఉద్యోగాలలో చేరిపోవాలి. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ అభిరుచులను, కోరికలను, ఆలయాలను బేరీజు వేసుకుంటా.. మీ నైపుణ్యాలను మరింత పదును చేసుకోవచ్చు. పని ఎంత కష్టం అయినప్పటికీ దానిని అధిగమిస్తూనే భవిష్యత్ కార్యాచరణలను ఏర్పాటు చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమయానుకూలంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ.. కెరీర్ ను నచ్చిన విధంగా మలుచుకుంటూ వెళ్లాలి.

బలమైన నిర్ణయాలు మనసులో పదిలం పరుచుకోవడం…

మీరు ఏం చేయాలనుకుంటున్నారోననే విషయం మీకు అవగాహన వచ్చినప్పుడు.. దానినే మనసులో పదిలం పరుచుకోవాలి. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు పదిలం చేసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ.. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాని గురించే ఆలోచించుకోవాలి. అలాకాకుండా తరచూ నిర్ణయాలను మార్చుకుంటూపోతే.. సమయం వృథా అవడమే కాకుండా కెరీర్ పరంగా అవకతవకలు ఎదరవుతాయి.

మీరు ఏ జాబ్ అయితే చేయాలనుకుంటున్నారో… ఆ గమ్యాన్నే చేరుకోవాలనే ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. దానికి మాత్రమే కట్టుబడి వుండేవిధంగా ప్రయత్నించాలి. మీరు ఎంచుకున్న వృత్తిని మీరు సమన్యాయం చేయగలరా..? దాని నుంచి మీరు సంతోషం పొందగలుగుతారా..? మీ కెరీర్ కు అది ఎంతవరకు సహకరిస్తుంది..? అని అంశాల గురించి ముందుగానే ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. అప్పుడే మీకు మీరుగా.. మీరు ఎంచుకున్న కెరీర్ ను సంతోషంగా అనుభవిస్తూ, ముందుకు సాగిపోగలరు.

సహాయాలు తీసుకోవడం…

ఒకవేళ మీరు ఎంచుకున్న నిర్ణయంలో మీకు ఏమైనా అనుమానాలు వుంటే వాటి గురించి మీ బంధుమిత్రులతో, సన్నిహితులతో కలిసి చర్చించుకుంటే ఇంకా చాలా మంచిది. అప్పుడు అందులో వున్న లోపాలు, కష్టాలు, నష్టాల గురించి తెలుసుకోవడానికి కూడా ఆస్కారం వుంటుంది. పైగా మీలో వున్న నైపుణ్యతను, సామర్థ్యతను కూడా నలుగురితో చర్చించుకున్నప్పుడు మీ అసలు స్వభావం గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.

ఇలా ఈ విధంగా మీరు ముందుగానే కొన్ని ప్రణాళికలను, నిర్ణయాలను సిద్ధం చేసుకుని.. సమయానుకూలంగా వాటిని అమలుచేసుకుంటే.. మీరు కోరిన విధంగా మీ కెరీర్ ను మలుచుకోవచ్చు.

-teluguwishesh